అమరావతి రాజధాని వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 6 నెలల్లో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు తీర్పుపై దేశపు అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, ఈ వ్యవహారంపై అమరావతి రైతులు కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో, అమరావతి అంశంపై దాఖలయిన పిటిషన్లను ఈ నెల 28న విచారణ జరపాలని నవంబరు 14న దేశపు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని దేశపు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వం అయితే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అంటూ నిలదీసింది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించినట్టుగా కనిపిస్తోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
అదే సమయంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. దీంతోపాటు, హైకోర్టును కర్నూలుకు తరలించడంపై సుప్రీం కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. రైతులకు న్యాయం చేయడంపై జగన్ సర్కార్ ఏం చెబుతుందో అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా తాజా తీర్పులో జగన్ కు షాక్ తగిలినట్లయింది.