అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు అవమానకర రీతిలో విమర్శించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఇళ్లలోని ఆడవాళ్లను లాగిన వైసీపీ నేతలపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికితోడు, చంద్రబాబు మైక్ కట్ చేయడం, ఆ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…వైసీపీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు.
మైక్ లో కాకుండా పక్కనెవరో చేసిన కామెంట్ల కౌంట్ కాదంటూ మంత్రి బొత్స కొత్త భాష్యం చెప్పారు. ఆ వ్యాఖ్యలను సమర్థించడం లేదంటూనే…అందరినీ ఒకే గాటన కట్టొద్దంటూ తమ సభ్యుల తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే, బొత్స ఈ వ్యాఖ్యలు చేసి 24గంటలు గడవక ముందే…స్పీకర్ తమ్మినేని మళ్లీ పాతపాట పాడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.
అసలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభలో లేని మహిళల ప్రస్తావన ఎక్కడా రాలేదని తమ్మినేని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, వ్యక్తిగత వ్యవహారాలను సభ ముందు పెట్టడం సరికాదంటూ హితవు పలికారు. సభలో అందరినీ సమానంగా చూస్తున్నానన్న తమ్మినేని, చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోలేదు.
తమ్మినేని తాజా వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. వైసీపీ సభ్యులు ఆ కామెంట్లు చేశారని బొత్స పరోక్షంగా ఒప్పుకున్నారని, తమ్మినేని మాత్రం అసలు కామెంట్లు చేయలేదంటూ బుకాయిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరిలో అబద్ధం చెబుతున్నదెవరని ప్రశ్నిస్తున్నారు. ఇదో కొత్త ట్రెండ్ అని…ఒకరేమో అన్నారని, మరొకరు అనలేదని ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.