భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసల జల్లు కురిపించారు. జస్టిస్ ఎన్వీ రమణ మంచి న్యాయమూర్తే కాదు, ఓ మంచి మానవతామూర్తి అని ఆకాశానికెత్తేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో చాలాకాలంగా పరిచయముందని, దేవుడంటే భయపడే వ్యక్తి కాదని, దేవుడిని ప్రేమించే వ్యక్తని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తుషార్ మెహతా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యాయశాస్త్రపరంగా జస్టిస్ ఎన్వీ రమణ ఎంతో తెలివైన వ్యక్తి అని తుషార్ మెహతా అన్నారు. పక్షపాతం లేకుండా తీర్పులను ఇస్తారని, తమ న్యాయవాదుల కుటుంబానికి ఆయనే ‘కర్త’ అని కితాబిచ్చారు. బార్ కౌన్సిల్ చైర్మన్ ఎం.కె. మిశ్రా వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ రమణకు తుషార్ మెహతా క్షమాపణలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన జస్టిస్ ఎన్వీ రమణ…తమపై ప్రజలుంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని అన్నారు. నైతిక విలువలతో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వారు బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.
కరోనా మహమ్మారి న్యాయవ్యవస్థపై కూడా ప్రభావం చూపిందని, ఎంతోమంది న్యాయవాదులు కొవిడ్ తో మరణించారని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. వర్చువల్ విచారణలో ఎన్నో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, న్యాయశాఖ చొరవ చూపి వాటిని పరిష్కరించాలని కోరారు.
కోర్టుల్లో ఖాళీల భర్తీకి న్యాయశాఖ మంత్రి చొరవ చూపిన వైనం సంతృప్తికరంగా ఉందని, భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.