అగ్రరాజ్యమైన అమెరికాలో అన్ని దేశాల ప్రజలు ఉంటారు. సింఫుల్ గా చెప్పాలంటే నానాజాతి సమితి అని చెప్పేసుకోవచ్చు. ఆ మాటకు వస్తే.. అమెరికా దేశం.. ఫలానా జాతివారి సొంతమన్న మాట ఉండదు. వలస జీవులతో నిండిన అమెరికాలో తెల్లతోలు వాళ్లంతా తమకు మించిన అమెరికన్లు ఉండరన్నట్లుగా ఫోజులు కొడతారు. అమెరికా జాతి నిర్మాణంలో రక్తం చిందించిన నల్లోళ్లను ఇప్పటికి రెండో శ్రేణి పౌరులుగా చూడటం.. వారి పట్ల జాత్యాంహాకారాన్ని ప్రదర్శించటం తెలిసిందే.
విదేశీయులుగా ఆ దేశానికి వెళ్లి కాల క్రమంలో అక్కడే పట్టు సాధించిన దేశీయుల్లో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఆ మాటకు వస్తే అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయులే అత్యధికమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. పలువురు భారతీయ అమెరికన్లు ఇప్పుడు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. అయినప్పటికీ ఆ దేశంలో భారతీయ అమెరికన్లు నిత్యం వివక్షను ఎదుర్కోవటం సర్వసాధరణమన్న విషయాన్ని తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. మొత్తం అమెరికన్లలో ఇండియన్ అమెరికన్లు 1 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. రిజిస్టర్ ఓటర్లలో ఒక శాతం కంటే తక్కువ ఉన్నారు.
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్–ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా ఒక సర్వేను గత ఏడాది నిర్వహించాయి. దీనికి సంబంధించిన నివేదికను బుధవారం విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1200 మంది భారతీయ అమెరికన్లను ఆన్ లైన్ ద్వారా ప్రశ్నించారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈ సర్వే రిపోర్టును రూపొందించారు. తాజా రిపోర్టులో ప్రధానంగా ప్రస్తావించిన అంశం.. ప్రతి ఇద్దరిలో ఒకరు తాము అమెరికాలో వివక్షను ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారు.
తమ చర్మం రంగుకు సంబంధించి తరచూ అవహేళనకు గురి అవుతుంటామని చెప్పారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడి దేశ పౌరులుగా మారిన వారు మాత్రమే కాదు.. అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయుల పరిస్థితి కూడా ఇదేనని చెప్పటం గమనార్హం. భారతీయ తండ్రి – అమెరికా తల్లి, భారతీయ తల్లి – అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటున్నట్లు వాపోవటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం కీలకపాత్రను పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకు ఒకసారైనా ప్రార్థన చేస్తామని 40 శాతం మంది చెబితే.. వారంలో ఒక్కరోజైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27 శాతం మంది చెప్పటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కులాన్నికూడా భారతీయ అమెరికన్లు విడిచిపెట్టటం లేదన్న విషయం తాజా సర్వేలో వెల్లడైంది. ఇండియాలో పుట్టి అమెరికాకు వెళ్లిన వారు తమ పేరుతో పాటు.. తాము ఏ కులానికి చెందిన వారిమన్న విషయాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదని తేలింది. అదే సమయంలో వారి పుట్టిన సంతానం మాత్రం కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరని తేలింది. మొత్తం హిందువుల్లో ప్రతి పది మందిలో ఎనిమిదిమంది తమ కులంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించటం గమనార్హం.