తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని వైఎస్ షర్మిల చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగుల సమస్యపై పలుమార్లు దీక్షలు, నిరసనలు చేపట్టారు షర్మిల. ఈ క్రమంలోనే ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో షర్మిల దీక్షలు చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని రేపు పరామర్శించి అక్కడే దీక్ష చేయాలని షర్మిల ప్లాన్ చేశారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ కుటుంబసభ్యులను పరామర్శించి..ఆ తర్వాత దీక్ష చేయాలని షర్మిల ప్లాన్ చేశారు. రేపు దీక్ష చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, హఠాత్తుగా షర్మిలకు ఆ కుటుంబం షాకిచ్చింది. షర్మిల నిరసన దీక్షకు తాము సహకరించబోమని నరేష్ కుటుంబ సభ్యులు ప్రకటించడంతో షర్మిలకు, వైఎస్సార్ టీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది.
షర్మిలను తమ ఇంటికి రావద్దని నరేష్ తండ్రి భూక్యా శంకర్ నాయక్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగం రాలేదన్న బాధతో తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ, కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న తమను ఇంకా బాధించొద్దని ఆయన కోరారు. తన కొడుకు చావును రాజకీయం చేయవద్దంటూ షర్మిలకు విజ్ణప్తి చేస్తూ శంకర్ నాయక్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు చేపట్టదలిచిన నిరుద్యోగ దీక్ష ఉంటుందా? లేక వాయిదా వేస్తారా? మరో ప్రాంతంలో దీక్ష చేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
అంతకుముందు, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నామని షర్మిల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని ముందుండి నడిపి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది విద్యార్థులేనని.. రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి నిరాశే ఎదురైందని షర్మిల అన్నారు. కేసీఆర్‌కి గుణపాఠం చెప్పేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులను బరిలో దించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులతో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి సీఎం మెడలు వంచాలని నిర్ణయించామని షర్మిల చెప్పారు.