ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల నియామకంతో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా ఆత్మరక్షలో పడిన సంగతి తెలిసిందే. ఇక, షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే అన్న జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం…జగన్ రెడ్డి అంటూ సంబోధించడం సంచలనం రేపింది. మూడు రాజధానులపై సోదరుడు జగన్ ను షర్మిల నిలదీయడంతో వైసీపీ నేతలు నీళ్లు నమలాల్సిన పరిస్థితి. షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ సజ్జల చెప్పడం చూస్తే వైసీపీ నేతలు ఎంత సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్నారో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు మరింత షాకిచ్చేలా షర్మిల జిల్లాల పర్యటన మొదలుబెట్టారు.
జనవరి 23 నుంచి జనవరి 31 వరకు 9 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పర్యటించి పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పార్వతీపురంలో మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమీక్షిస్తారు. ఆ తర్వాత విజయనగరంలో సాయంత్రం 6 నుంచి 7 వరకు సమీక్ష నిర్వహిస్తారు.
జనవరి 24న విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, జనవరి 25న కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. 27న గుంటూరు, పల్నాడు, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, 30న శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, 31న నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు. జగన్ పై దూకుడు పెంచిన షర్మిల ఫిబ్రవరి నెలలో బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.