ఏపీ హైకోర్టు వెలువరించిన ఒక తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. చట్టం ముందు సమానమే అన్న విషయాన్ని తన తీర్పుతో మరోసారి నిరూపించింది. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్షతో పాటు.. ఫైన్ చేసిన వైనం ఏపీ హైకోర్టులో చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన ఏ కేసులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారన్న విషయాన్ని చూస్తే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా బాలక్రిష్ణమాచార్యులు వ్యవహరిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో 2017లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవటంతో కోర్టు ధిక్కారణ నేరానికి పాల్పడినట్లుగా గత వారం హైకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి డిసెంబరు 31న తీర్పును వెలువరించింది.
గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం హైకోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. కోర్టు ధిక్కార నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంటే కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చోవాలని శిక్ష వేస్తూ తీర్పును ఇచ్చింది.
అంతేకాదు.. ఈ కేసులో రూ.వెయ్యి జరిమానా విధించింది. ఒకవేళ.. కోర్టు పేర్కొన్నట్లు రూ.వెయ్యి జరిమానాను చెల్లించని పక్షంలో వారం రోజుల పాటు సాధారణ జైలుశిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కారణ కేసుల విషయంలో కోర్టుల ఎలాంటి తీర్పులు ఇస్తాయన్న విషయంతో పాటు.. హోదాతో సంబంధం లేకుండా చర్యలు ఉంటాయన్న విషయాన్ని ఏపీ హైకోర్టు తాజా ఎపిసోడ్ లో స్పష్టం చేసిందని చెప్పాలి.