మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తుండడంతో మెగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తండ్రీకొడుకులిద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో నటిస్తున్న తొలి చిత్రం ఆచార్య కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా ఎప్పుడెపుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు.
అయితే, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ ల నేపథ్యంలో ఈ చిత్ర విడుదల తేదీ వాయిదాపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 పాటలు మినహా ఈ చిత్ర టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రబృందం ట్వీట్ చేసింది. మేలోనే విడుదల కావాల్సిన ‘ఆచార్య’ షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇటీవల మళ్ళీ షూటింగ్ మొదలవడంతో టాకీ పార్ట్‌ను త్వరగా కంప్లీట్ చేశారు. త్వరలోనే మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే రిలీజ్ డేట్ కూడా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రూపంలో మెగా ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక, ఈ చిత్రం పూర్తి కాగానే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ ను చిరు మొదలుపెట్టబోతున్నారట. ఈ చిత్ర టైటిల్ ‘గాడ్ ఫాదర్’ అని ఫిక్స్ అయిందని టాక్ వస్తోంది.
అంతేకాదు, చిరు స్వయంగా ఫోన్ చేసి అడగడంతో తాను రిజిస్టర్ చేసుకున్న ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ను చిరు కోసం డైరెక్టర్ సంపత్ నంది త్యాగం చేశారని తెలుస్తోంది. ఈ టైటిల్‌ను చిరు బర్త్ డేకి అనౌన్స్ చేస్తారనే టాక్ వస్తోంది. మరోవైపు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘వన్’ను కూడా చిరు రీమేక్ చేస్తే బాగుంటుందని, ప్రత్యక్ష రాజకీయాలను అతి దగ్గరగా చూసిన చిరుకు ఆ కథ సరిగ్గా సరిపోతుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.