టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతడికి ప్రాణాపాయం లేకపోయింది కానీ.. గాయాలు మాత్రం కాస్త తీవ్రమైనవే అని ఆ సమయంలోనే వెల్లడైంది. కొన్ని నెలల పాటు అతను ఆసుపత్రికే పరిమితం అయ్యాడు. డిశ్చార్జి అయ్యాక కూడా కోలుకుని బయటికి రావడానికి సమయం పట్టింది. ప్రమాదం జరిగిన ఏడాది కానీ తేజు తన కొత్త చిత్రం ‘విరూపాక్ష’ షూటింగ్‌కు హాజరు కాలేదు.
ఇక ఈ చిత్రంలో తేజు మునుపటిలా ఫుల్ ఎనర్జీతో అయితే కనిపించలేదు. బరువు పెరిగాడు. కదలికలు, డైలాగ్ డెలివరీ నెమ్మదిగా అనిపించాయి. అతడి కొత్త చిత్రం ‘బ్రో’కు సంబంధించిన పాటల్లోనూ తేజు మూమెంట్స్ స్లోగానే అనిపించాయి. ఈ నేపథ్యంలో తేజు మీద యాక్సిడెంట్ ప్రభావం ఇంకా కొనసాగుతోందా అనే సందేహాలు మెగా అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ సందేహాలకు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తేజునే సమాధానాలు చెప్పాడు.
‘‘అవును.. నా మీద యాక్సిడెంట్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఫిజికల్‌గా నేను ఒకప్పటంతా ఫిట్‌గా లేను. నాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయినపుడు నేను 13 రోజుల పాటు కోమాలో ఉన్నాను. అప్పుడు నాకు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది. వాటి వల్ల నేను బాగా బరువు తగ్గిపోయాను. 71 కేజీలకు వచ్చేశాను. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక స్టెరాయిడ్స్ లేకపోవడం, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడంతో మళ్లీ బరువు పెరిగాను. ఇప్పటికీ వర్కవుట్స్ చేసే పరిస్థితి లేదు. నాకు మాట్లాడ్డంలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ‘విరూపాక్ష’ సినిమాలో కొంచెం బరువు ఎక్కువగానే కనిపించాను. ఆ సినిమాలో పాటలు లేవు. అందుకు స్కోప్ కూడా లేదు.
‘బ్రో’ నుంచి వచ్చిన రెండు పాటల్లో నా డ్యాన్సులు నాకే సంతృప్తికరంగా అనిపించలేదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను 100 పర్సంట్ ఫిట్‌గా లేకపోయినా.. నాకు కొన్ని సమస్యలున్నా.. ఎక్కడా ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతోనే సినిమాల్లో నటిస్తున్నా. ఇప్పుడు నేనున్న స్థితిలో 100 పర్సంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ‘విరూపాక్ష’ టైంకి, ‘బ్రో’ టైంకి చాలా మెరుగయ్యాను. ఇంకా మెరుగుపడతాను. నా తర్వాతి సినిమాకు ఒకప్పట్లా పూర్తి ఎనర్జీతో ఉండాలనుకుంటున్నా. అందుకే ఐదారు నెలలు బ్రేక్ తీసుకుందామనుకుంటున్నా. ఒక సర్జరీ కూడా చేసుకోవాల్సి ఉంది. ఫిజికల్ హెల్త్ మీద పూర్తిగా దృష్టిపెడతాను’’ అని తేజు నిజాయితీగా తన పరిస్థితిని వివరించాడు.