మెగా ఫ్యామిలీలో గత ఏడాదే వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అందరి చూపులు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పైనే పడ్డాయి. తేజ్ కూడా ఒక ఇంటివాడైతే చూడాలని మెగా ఫాన్స్ ఆశపడుతున్నారు. ఇదే తరుణంలో సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించి తరచూ ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
రీసెంట్ గా ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ తో సాయి ధరమ్ తేజ ప్రేమలో పడ్డాడని.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తేజ్ టీమ్ ఖండించింది. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేల్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా `ఉషా పరియణం` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ కు ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
`మీ లవ్ గురించి చెప్పండి` అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు సాయి ధరమ్ తేజ్ `వన్‌సైడ్ లవ్ ఉంది. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి మాట్లాడేలోపు మీకు పెళ్లి అయిపోయిందట కదా అంటున్నారు. నాకు పెళ్లా? అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు` అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వార్తలు పాపం తేజ్ కు గట్టి తంటాలే తెచ్చిపెడుతున్నాయని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
ఇక పెళ్లెప్పుడని యాంకర్ అడగ్గా.. `నా సినిమాలో నో పెళ్లి పాట ఉంది తెలుసు కదా` అంటూ సాయి ధరమ్ తేజ్ సమాధానం దాటవేశాడు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తేజ్ నుంచి చివరగా విరూపాక్ష, బ్రో వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈయన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన 18వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.