హీరోయిన్ ఎవరైనా సరే.. వారిని అడిగే ప్రశ్నలు దాదాపు కామన్ గా ఉంటాయి. అందుకే.. మిగిలిన రిపోర్టింగులతో పోలిస్తే.. సినిమా రిపోర్టింగ్ ఎంచక్కా హాయిగా ఉంటుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. సినిమా రిపోర్టింగ్ లో వచ్చే పెద్ద చిక్కేమిటంటే.. అందరిని పొగడాలి.. ఫీల్ గుడ్ వార్తలే రాయాలే తప్పించి.. రిపోర్టర్ కు తెలిసిన విషయాల్ని రాసేంత స్వేచ్ఛ మాత్రం ఉండదు.
మిగిలిన రిపోర్టింగ్ తో పోలిస్తే..తెలుగు మీడియాలో సినిమాలకు సంబంధించి నెగిటివ్ వార్తలు రాసే ఛాన్సు చాలా చాలా తక్కువ. అందుకే.. నెగిటివ్ విషయాలు బయటకు చెప్పాలనే తలంపు ఉన్న వాడికి ఏ మాత్రం సూట్ కాని పని ఏమన్నా ఉందంటే అది సినిమా రిపోర్టింగ్. ఇదంతా ఎందుకంటే.. సినిమా రిపోర్టింగ్ లో ఒక బ్యూటీని ఇంటర్వ్యూ చేస్తే..మిస్ కాకుండా అడిగే ప్రశ్న.. మీ పెళ్లి మాటేమిటి? అని.
సినిమాల్లోకి వచ్చి సరిగ్గా మూడు నాలుగు సినిమాలు చేయకముందే.. పెళ్లి గురించి అడిగేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు హీరోయిన్లు సైతం ఎలాంటి మొహమాటం లేకుండా.. మనసులోని విషయాల్ని లోపల దాచేసి.. అందరూ చెప్పే రోటీన్ సమాధానం చెప్పేసి.. చక్కా వెళ్లిపోతారు. అలాంటి స్టీరియో డ్రామాను బ్రేక్ చేసిన ఘనత మాత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (అఅక) హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ దే. ఆమె నటించిన ఈ మూవీ ఈ వారం విడుదల కానుంది.
చూసినంతనే సంపెంగ మాదిరి సన్నగా ఉండి.. ఆకర్షించే అందం ఆమె సొంతం. సినిమా గురించి అడిగినంతనే.. దాచుకోకుండా మనసుకు అనిపించిన సమాధానాల్ని ఇవ్వటం కనిపిస్తుంది. ఎప్పటిలానే ఆమెను సైతం పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు మాత్రం.. రోటీన్ కు భిన్నంగా తమ ఇంట్లో అందరిది లవ్ మ్యారేజేనని.. తాను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. తనను బాగా అర్థం చేసుకొని.. తన కెరీర్ ను సపోర్టు చేసే వాడికే తన మనసు అంటూ చెప్పేసిన రుక్సానా కోరుకున్నోడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి.