వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ సీఎం జగన్ పైశాచికానందం పొందుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ ను కట్టడి చేయడంలో విఫలమైన జగన్…కక్షా రాజకీయాలకు తెరతీసి ప్రజల దృష్టి మరలిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కరోనా కాలంలోనూ కేసులు, ఫ్యాక్షన్ రాజకీయాలపైనే జగన్ ఫోకస్ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ పాలనను ప్రశ్నించిన పాపానికి ఇప్పటికే ఏపీ టీడీపీ అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు బనాయించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి అచ్చెన్న కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అంతేకాదు, వారిపై 107 బైండోవర్ కేసులు నమోదు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
అచ్చెన్నాయుడు సోదరుడు హరివర ప్రసాద్, ఆయన కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై పోలీసులు రౌడీషీట్స్ నమోదు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కేసుల ఆధారంగా బైండోవర్ కేసులను పెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే, బైండోవర్ను ఉల్లంఘించి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నందున రౌడీషీట్లు తెరిచినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కానీ, ఇది అచ్చెన్నను వేధించడం కోసమే బనాయించిన కేసులని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.