వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాలకు రాం రాం చెప్పబోతున్నారా..? తిరిగి ఎంటర్టైన్మెంట్ రంగంలో బిజీ కాబోతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. సినీ పరిశ్రమలో రోజా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగారు. హీరోయిన్ గా ఫేడౌట్ అయ్యాక సహాయక పాత్రలను పోషించారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరం అయినప్పటికీ.. మోడ్రన్ మహాలక్ష్మి, జబర్దస్త్ వంటి షోస్ తో టెలివిజన్ రంగంలో కంటిన్యూ అయ్యారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణలో రోజాకు చోటు దక్కింది. మంత్రి పదవి వరించాక ఫుల్ టైం పాలిటిక్స్ చేసేందుకు సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి సైలెంట్ అయిన రోజా.. ఏపీలో కంటే పొరుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించారు. ఒకానొక టైమ్ లో రోజా వైసీపీని వీడి తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది
కానీ, రోజా ఆ ప్రచారాన్ని ఖండించారు. వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాలో స్థానం దక్కడంతో మళ్లీ పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే తరుణంలో రోజాపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. రోజా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలను బయటకు లాగుతోంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని గట్టి ఆరోపణలు రావడంతో.. సర్కార్ అంతర్గత విచారణ చేపట్టింది. దీంతో రోజా త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమనే టాక్ మొదలైంది.
ఈ క్రమంలోనే రోజా మళ్లీ సైలెంట్ అయ్యారు. రాజకీయ విమర్శలు తగ్గించారు. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానేశారు. అలాగే తన అవినీతి వ్యవహారంలో అరెస్ట్ కాకుండా రాయలసీమ జిల్లాకు చెందిన మంత్రితో రోజా రాజీ చేసుకుంటున్నట్లు సైతం ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో ఆమె బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీ తెలుగులో `డ్రామా జూనియర్స్` షో కొత్త సీజన్ ప్రారంభం అయింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకు డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. డ్రామా జూనియర్స్ తొలి ఎపిసోడ్ లో రోజా ఒక స్కిట్ కూడా చేయడం విశేషం. దీంతో రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా రోజా రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేక గతంలో మాదిరి బుల్లితెరపై కొనసాగుతూ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తారా? అన్నది చూడాలి.