గడిచిన కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని సరికొత్త వాతావరణాన్ని చూస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ వర్సెస్ సౌత్ అన్న చర్చ అంతకంతకూ పెరగటమేకాదు.. పెద్ద హీరోలు నుంచి సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు రియాక్టు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాల్ని డామినేట్ చేస్తూ.. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న వైనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలు బాలీవుడ్ కు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో సౌత్ నుంచి వచ్చిన పుష్ప.. కేజీఎఫ్..ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు బాక్సాఫీసును షేక్ చేసేసి భారీ కలెక్షన్లను రాబట్టంతో బాలీవుడ్ ప్రముఖ హీరోలు సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సౌత్ కు చెందిన ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ లు రెండూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరటం బాలీవుడ్ కు షాకింగ్ మారింది. ఇలాంటివేళ..సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ వెనుకపడిపోయినట్లుగాసాగుతున్న చర్చపై తాజాగా బాలీవుడ్ నటి.. ఓటీటీలో తనదైన ముద్ర వేసే హాట్ బ్యూటీ రిచాచద్దా రియాక్టు అయ్యారు.
ఆమె నటించిన ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. 2017లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇప్పటికి మూడు సీజన్లు రావటం తెలిసిందే. ఈ మధ్యనే మూడో సిరీస్ రావటం.. అది కూడా సక్సెస్ కావటం తెలిసిందే. ఇక.. బాలీవుడ్ వర్సెస్ సౌత్ అంశంపై ఆమె ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ ను ప్రస్తావించారు.
సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు రూ.100 నుంచి రూ.400 లోపు మాత్రమే ఉంటాయని.. అందుకే ఆ ఖర్చుకు అక్కడి అభిమానులు పట్టించుకోరన్నారు. స్టార్ హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండటం.. వారంతా డబ్బులు ఎక్కువ పెట్టి మరీ సినిమాను చూసేందుకు వెనుకాడరన్నారు. అందుకు మంచి ఓపెనింగ్స్ వస్తాయన్నారు. బాలీవుడ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటాయన్నారు. బాలీవుడ్ లో సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా టికెట్ ధర మాత్రం రూ.400లతో ప్రారంభం అవుతుందని.. కొన్ని సినిమాలకుఈ ధర మరింత ఎక్కువగా ఉంటుందన్నారు.
అందుకే అంత ధర పెట్టి సినిమాను చూసే విషయంలో ప్రేక్షకులు తెగ ఆలోచిస్తారన్నారు. ఈ కారణంతో మధ్యతరగతి వారు సినిమా చూసే డబ్బులతో నిత్యవసరాలు కొనేందుకు మొగ్గు చూపుతారన్నారు. హిందీలో డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ బాలీవుడ్ కు శాపంగా మారిందంటున్నారు. టాలీవుడ్ లో టికెట్ ధరల్ని అంతకంతకూ పెంచేస్తున్న వైనం కూడా ఇలాంటి దెబ్బ పడుతుందన్న విషయాన్ని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు.. నిర్మాతలు ఎప్పటికి గుర్తిస్తారో?