‘‘చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూస్తున్నాను. అయితే ఈ పోస్ట్ పెట్టేందుకు నేను ఎవరి వద్దా డబ్బులు తీసుకోలేదు. నాకు చెప్పాలి అనిపించింది చెప్పాను’’ అంటూ ప్రముఖ సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
హైదరాబాద్ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న మాధవీలత ఫోటోను షేర్ చేస్తూ రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాధవీ లతను స్ట్రాంగ్ ఉమెన్ అంటూ రేణు పొగిడారు. అయితే, అలా తాను పొగిడేందుకు డబ్బులు తీసుకోలేదు అంటూ ఆమె చేసిన కామెంట్ వైరల్ గా మారింది. బీజేపీతో పవన్ కల్యాణ్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతను పొగడలేదు అన్న రీతిలో రేణు దేశాయ్ కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే, కొందరు నెటిజన్లు దీనికి నానార్థాలు తీసి బోడిగుండుకు మోకాలుకు లింకు పెడుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
2000 సంవత్సరంలో బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ మొదలయింది. ఆ తరువాత సహజీవనం మొదలుపెట్టారు. 2003లో జానీ సినిమాలో ఇద్దరూ నటించారు. పెళ్లికి ముందే 2004లో వారికి అకీరా నందన్ అనే అబ్బాయి పుట్టాడు. 2009లో విమర్శల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య రేణు దేశాయ్ ని కొడుకు సమక్షంలో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు. 2011లో విడాకులకు ధరఖాస్తు చేసుకోగా 2012లో మంజూరయ్యాయి. అప్పటి నుండి రేణు దేశాయ్ పవన్ కు దూరంగా ఉంటుంది.