తెలంగాణలో రెండేళ్లుగా కొన ‘సాగుతోన్న’ టీపీసీసీ అధ్యక్షుడి ఎపిసోడ్ కు కాంగ్రెస్ అధిష్టానం చెక్ చెప్పిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వస్తోన్న ఊహాగానాలకు తగ్గట్టు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డినే టీపీసీసీ చీఫ్ గా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. రేవంత్ కు మోకాలడ్డేందుకు చాలామంది కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపడినప్పటికీ…కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ కే పట్టం కట్టింది.
అయితే, తెలంగాణలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను దీటుగా ఎదుర్కొనగల సత్తా రేవంత్ కు ఉందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నమ్మారు కాబట్టే రేవంత్ కు ఆ పదవి ఇచ్చారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, రేవంత్ నే ఆ పదవికి ఎంపిక చేయడానికి మరికొన్ని కారణాలున్నాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టో ఎవరో అధిష్టానానికి, కాంగ్రెస్ ను నమ్ముకున్నతెలంగాణ నేతలకు అర్థం కాని పరిస్థితి. మిగతా వాళ్లకి ఇస్తే వారికి కేసీఆర్ గాలం వేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అదీగాక, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో పోరాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దామంటే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నాడు…కాబట్టి పార్టీపరంగా ఇది అంత ఆమోదయోగ్యం కాదు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో బలమైన యువనేతగా పేరున్న రేవంత్ రెడ్డికి అధిష్టానం ఓటు వేసింది. గతంలో రేవంత్ ను కక్షపూరితంగా కేసీఆర్ జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తనను జైలుకు పంపాడన్న కసితో రేవంత్ పనిచేస్తాడన్న ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. కేసీఆర్, కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై, టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రివేంజ్ తీర్చుకునే క్రమంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తారన్న ఆలోచన ఉంది.
కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఓడించాల్సిన అవసరం, ఓడించగలిగే సామర్థ్యం రేవంత్ రెడ్డికే ఉన్నాయని చాలామంది కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు నమ్ముతున్నారు. అందుకే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి సరైన ఎంపిక అని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మరి, అధిష్టానం అంచనాలను రేవంత్ ఎంతవరకు అందుకోగలరన్నది తెలియాలంటే 2023 ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.