టాలీవుడ్ చరిత్ర చూస్తే హీరోలు, హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. స్టార్ ఇమేజ్ సంపాదించాక సొంత బేనర్లో సినిమా చేసుకుని ఎక్కువ ఎందుకు సంపాదించకూడదు అన్న ఆలోచన వస్తుంటుంది.
అలాగే హీరోల హోదా పెరగడానికి కూడా సొంత నిర్మాణ సంస్థ ఉపయోగపడుతుంది. అలాగే తమ ద్వారా ఎంతోమందికి ఉపాధి కలిగించామన్న సంతృప్తి కూడా దొరుకుతుంది. ఐతే హీరోలు ప్రొడక్షన్లోకి దిగితే అది పక్కా ప్లానింగ్‌తోనే ఉంటుంది.
తమ దగ్గరికి వచ్చే ఉత్తమమైన ప్రాజెక్టులనే సొంత బేనర్లో సెట్ చేసుకుంటారు. మాస్ రాజా రవితేజ కూడా అదే చేసినట్లున్నాడు. టాలీవుడ్లో చాలా లేటుగా ప్రొడక్షన్లోకి దిగుతున్న స్టార్ హీరో రవితేజనే.
దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న రవితేజ.. ఎట్టకేలకు ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టాడు. తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్టీ టీమ్ వర్క్స్’ అనే బేనర్‌ను మొదలుపెట్టాడు మాస్ రాజా.
ఈ ఏడాది ఆరంభంలో ‘క్రాక్’తో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్న మాస్ రాజా.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టాడతను. అందులో ఒకటి శరత్ మండవ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం.
ఎస్ఎల్వీ సినిమాస్ బేనర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రవితేజ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. పోస్టర్ మీద రవితేజ బేనర్ ‘ఆర్టీ టీమ్ వర్క్స్’ పేరు కూడా పడిరది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఇలాగే సొంత బేనర్లు పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం తెలిసిందే. సొంతంగా సినిమాలను నిర్మించకపోయినా తమ పారితోషకాలనే పెట్టుబడిగా పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం.. లాభాల్లో వాటా తీసుకోవడం.. తమ ప్రొడక్షన్ టీం కొంచెం అనుభవం సంపాదించాక సొంతంగా సినిమాలు నిర్మించడం గమనించవచ్చు.
రవితేజ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లున్నాడు. ఒక కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంతో రవితేజ నిర్మాతగా మారడం విశేషమే. కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన శరత్ మండవపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి నిర్మాతగా మాస్ రాజాకు ఈ చిత్రం ఎలాంటి ఆరంభాన్నిస్తుందో చూడాలి.