ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ నామ స్మరణే వినిపిస్తోంది. హిందువుల దశాబ్దాల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం జరిగి.. అక్కడ ఈ రోజే శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ఠ చేస్తుండటంతో రామ భక్తులు పరమానందభరితులవుతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తూ కోట్లమంది భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా రాముడి ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.
ట్విట్టర్ సహా అన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్లలో ట్రెండింగ్ టాపిక్ రాముడే. ఐతే అన్ని పాజిటివ్ ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్స్ మధ్య.. ఒక నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ టాప్లో ట్రెండ్ అవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. #Ravanafromtamilanadu అంటూ రాముడికి వ్యతిరేకంగా తమిళ నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ మీద పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్నారు.
తమిళనాడులో హిందుత్వాన్ని.. రాముడిని వ్యతిరేకించే వ్యతిరేకించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా అక్కడి అధికార పార్టీ డీఎంకే ఎప్పుడూ హిందూ తత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి.. రామసేతు నిర్మాణాన్ని ఎద్దేవా చేస్తూ.. రాముడు ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు అని ప్రశ్నించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఇటీవలే సనాతన ధర్మం గురించి చేసిన ప్రతికూల వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
హిందువులు దేవుడిగా కొలిచే రాముడి కంటే రాక్షసుడైన రావణుడినే డీఎంకే మద్దతుదారులు, ఇంకొందరు తమిళులు ఓన్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజు.. రావణుడికి మద్దతుగా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.