చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చిన తరువాత వైసీపీలో భయం మొదలైంది. వెంటనే జగన్ కూడా దిల్లీ టూర్ పెట్టుకుని మోదీని కలిసొచ్చాడు.
అయితే… మోదీ అపాయింట్మెంట్ కోసం వైసీపీ వాళ్లు ప్రాథేయపడుతుంటే మోదీ, అమిత్ షాలు మాత్రం టీడీపీ నేతలను పిలిచి మర్యాదలు చేస్తున్నారు.
చంద్రబాబు కూడా అమిత్ షా నుంచి ఆహ్వానం అందితేనే వెళ్లి కలిసి వచ్చారు. చంద్రబాబు తరువాత ఏకంగా మోదీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు విందుకు ఆహ్వానం అందింది.
చంద్రబాబు అమిత్ షాను కలిసినప్పుడు దాదాపుగా పొత్తుల విషయంతో పాటు సీట్ల లెక్కలు కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందుకే చంద్రబాబు దిల్లీ నుంచి రాగానే త్యాగాలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రీణులకు, నాయకులకు చెప్పారు.
ఒకట్రెండు రోజుల్లో బీజేపీకి ఏఏ సీట్లు ఇస్తారనేది తేలిపోనుంది కూడా.
చంద్రబాబు, అమిత్ షాల భేటీ తరువాత మోదీ కూడా టీడీపీ ఎంపీలను తమ వారిగానే చూడడం ప్రారంభించారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులో మోదీ చిన్న పాటి విందు ఏర్పాటు చేశారు. దానికి దేశంలోని 9 మంది ఎంపీలను పిలిచారు. అందులో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు.
మోదీ తానే స్వయంగా రామ్మోహన్ నాయుడిని ఆహ్వానించడం, ఆయన వెళ్లడం.. మోదీ పక్కనే ఉండి ఫొటోలు దిగడం చూస్తుంటే బీజేపీ, టీడీపీ భాయి భాయి అన్నట్లుగా కనిపిస్తోంది.
అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగిన మరుసటిరోజే మోదీ నుంచి రామ్మోహన్ నాయుడికి పిలుపు రావడం ఆ పార్టీ టీడీపీ పట్ల చూపుతున్న ఇంట్రెస్టుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
కాగా.. మోదీ ఇచ్చిన విందుకు రామ్మోహన్ నాయుడు కాకుండా హాజరైన మిగతా ఏడుగురు ఎవరా అని చూస్తే అందులో నలుగురు బీజేపీ ఎంపీలే, మరొకరు బీజేడీ ఎంపీ, ఇంకో ఇద్దరు బీఎస్పీ ఎంపీలు. దక్షిణ భారత దేశం నుంచి ఈ విందుకు పిలుపు అందుకున్నది రామ్మోహన్ నాయుడు ఒక్కరే.
వీరందరితో కలిసి మోదీ పార్లమెంట్ క్యాంటిన్లో భోజనం చేశారు. ఈ ఎంపీలందరినీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకే మోదీ ఆహ్వానించారు.
‘మీకు ఈ రోజు శిక్ష విధిస్తా… నాతో కలిసి లంచ్ చేయడమే మీకు ఈ రోజు శిక్ష’ అని సరదాగా అంటూ వారితో మాట్లాడుతూ మోదీ లంచ్ చేశారు.
ఈ పరిణామంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ఎంపీలు నలుగురిని… తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న బీజేడీ ఎంపీని.. లోపాయికారీగా సహకరిస్తున్న బీఎస్పీ ఎంపీలను పిలవడం సరే… టీడీపీ ఎంపీని పిలిచారంటే దానర్థం ఏంటనే చర్చ జరుగుతోంది.
అంతేకాదు… వైసీపీ నుంచి ఒక్కరిని కూడా పిలవకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. గత అయిదేళ్లలో బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడిన వైసీపీ ఎంపీలలో ఒక్కరిని కూడా పిలవకుండా రామ్మోహన్ నాయుడిని పిలిచారంటేనే విషయం అర్థమైపోతోంది అంటున్నారు ప్రజలు కూడా.
టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏపీలో ఏర్పడడం ఖాయమని అంటున్నారు.