తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ మైలేజ్ పెంచేందుకు రామ్‌చరణ్ రంగంలోకి దిగుతున్నారా? పవన్ రాజకీయ భవిష్యత్ గొప్పగా సాగేందుకు రామ్‌చరణ్ తన వంతు సాయం చేసి తోడుగా ఉండబోతున్నారా? అంటే ఇటు సీని వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తన బాబాయ్ రాజకీయ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచేందుకు రామ్‌చరణ్ ఓ న్యూస్ ఛానెల్‌ను కొనేందుకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు ఈ విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న రామ్‌చరణ్.. ఎంటర్ ప్రెన్యూవర్గానూ కొనసాగుతున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా బాధ్యతలు చూసుకుంటూ ఇతర వ్యాపారాల్లోనూ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే ట్రూ జెట్ పేరుతో ఉన్న ఎయిర్‌లైన్స్‌తో పాటు హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. కాగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ న్యూస్ ఛానెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ఛానెల్ యాజమాన్యంతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆ ఛానెల్ కొంతమంది చేతులు మారింది. అయినప్పటికీ ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడంతో ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ ఎంట్రీతో ఆ ఛానెల్‌కు ఓ అండ దొరికినట్లయిందని సమాచారం. దీంతో పాటు మరో రెండు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్తోనూ రామ్‌చరణ్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చెర్రీ నటుడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు తీసుకున్నారంటే ఒకే.. కానీ న్యూస్ ఛానెల్‌ను కొనుగోలు చేయాలనుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లో ఇప్పటివరకూ సరైన బ్రేక్ రాలేదు. 2019 ఎన్నికలు ఆయనకు పీడకలను మిగిల్చాయి. ఆయనకు భారీస్థాయిలో అభిమాన బలం ఉన్నా దాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సరైన పత్రిక టీవీ ఛానెల్ మద్దతు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకెంతో ఇష్టమైన బాబాయ్‌కు సపోర్ట్‌గా ఉండేందుకు చెర్రీ న్యూస్ ఛానెల్ కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలు ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.