ఏపీ సీఎం జగన్ ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వరుస లేఖలతో బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆయనకే గుర్తు చేస్తూ….ఇరకాటంలో పడేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలోనే వరుసగా తొమ్మిది లేఖలు రాసిన రఘురామ…తాజాగా 10వ లేఖను జగన్ కు సంధించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం కేసును అశోక్ గజపతి రాజు గెలిచారని జగన్ కు గుర్తు చేశారు.
కానీ, ఉత్తరాంధ్ర ప్రతినిధి విజయసాయిరెడ్డి మాత్రం ఆ వ్యవహారంపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, విజయసాయిరెడ్డిని జగన్ కట్టడి చేయాలని, లేదంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయి, మంత్రులను నియంత్రించాలని, లేకుంటే పార్టీ ఇరకాటంలో పడుతుందని రఘురామ హెచ్చరించారు.
జగన్ స్పందించకుంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశముందని, అలా కాకూడదని తాను కోరుకుంటున్నానని రఘురామ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఉత్తరాంధ్రకు విజయసాయి సీఎం అనుకుంటున్నారని, అక్కడ వేల ఎకరాల భూములపై విజయసాయి కన్నుపడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.