దక్షిణాది చిత్రాలతో తెరంగేట్రం చేయడం…ఇక్కడ కొద్దో గొప్పో పేరు…పదో పరకో సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ కు వెళ్లి దక్షిణాది సినిమాలు…ముఖ్యంగా తెలుగు సినిమాలంతా చెత్త అని కామెంట్లు చేయడం ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్లకు ఫ్యాషనైపోయింది. గతంలో తాప్సీ పన్ను కూడా ఇదే తరహాలో కామెంట్లు చేయడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోగా…విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
తాజాగా ఇదే తరహాలో దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ మొదలుబెట్టిన రాశీ ఖన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దక్షిణాది సినిమాలు రొటీన్ గా ఉంటాయని… హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి, కనుమరుగవుతుంటుందని రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.హీరోయిన్ కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవని,బాలీవుడ్ లో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని… ఇకపై తనలో కొత్త నటిని చూస్తారని కామెంట్లు చేయడం దుమారం రేపింది.
దక్షిణాదిలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, అక్కడ తన టాలెంట్‌కు తగిన రోల్స్ రాలేదంటూ, అక్కడ హీరోయిన్స్‌ను మిల్కీ బ్యూటీ, డాల్స్ అంటారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడ్డారు. దీంతో, ఆ కామెంట్లపై రాశీ ఖన్నా స్పందించింది. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదంటూ.. దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ తాను వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. భాష ఏదైనా.. సినిమా ఏదైనా, తాను చేసే ప్రతి సినిమాపై గౌరవం మర్యాద ఉంటుందని, దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండంటూ ట్వీట్ చేసింది.