ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
గతంలో అంటే ఒక నెల కిందట విప్లవ రచయిత వరవరరావు అన్న మాటలను ఉటంకిస్తూ పీవీ రమేష్ ట్వీట్ చేయగా తీవ్ర చర్చనీయాంశమైంది. “నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడు తుంటే.. ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడు నేరస్తుడే!- వరవరరావు” కోట్ను పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని కొందరు గట్టిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో చివరకు.. పీవీ రమేష్ వివరణ ఇచ్చారు. తాను ఏ ఒక్క వ్యక్తిని లేదా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వరవరరావు మాటలను ఉటంకించలేదని పీవీ రమేష్ తేల్చి చెప్పారు.
విశ్వజనీనమైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తే.. మీ ఆలోచనా శక్తి అంతవరకే పరిమితమైనదిగా భావించవచ్చని అన్నారు. అంతటి తో అప్పట్లో ఆ వివాదం సర్దుమణిగింది.
అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి పీవీ రమేష్ .. మరిన్ని సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్.. తీవ్ర సంచలనంగా మారింది.
“కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు.. పాఠశాలలు.. యూనివర్సిటీలకు సెలవులు ఇవ్వకుండా.. పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిసి.. నేను షాక్కు గురయ్యాను. ఇది కరోనా మహమ్మారి వ్యాప్తిని మరింతగా పెంచుతుంది. పెరిగేందుకు ఆజ్యం పోస్తుంది. కాబట్టి.. `మంచి బుద్ధి` కలగాలని అనుకుంటున్నాను“- అని రమేష్ ట్వీట్ చేశారు.
అయితే.. ప్రస్తుతం విద్యార్థులు, పరీక్షలు, క్లాసుల వ్యవహారం కేవలం ఏపీలోనే అందునా జగన్ పాలనలోనే తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఇతర రాష్ట్రాలైన తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి, హాస్టళ్లను ఖాళీ చేయించి విద్యార్థులను ఇంటికి పంపేశారు.
కానీ, ఏపీలో జగన్ సర్కారు మాత్రం విద్యార్థులకు పరీక్షలు పెడతామని చెబుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ చేసిన తాజా ట్వీట్.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇది పూర్తిగా జగన్ను టార్గెట్ చేసుకునే చేశారంటూ.. కామెంట్లు విపరీతంగా వస్తుండడం గమనార్హం.