టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాగోలేదని, అసలు విషయం ఏంటో కూడా చెప్పకుండానే ఎలా అరెస్టు చేస్తారని బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. అయితే, అవినీతిని తాము సహించేది లేదన్నారు. అవినీతి ఎవరు చేసినా శిక్షించాలనే చెబుతున్నామన్నారు. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందా? లేదా? అనేది స్పష్టత లేదని, ఈ విషయంపైనే ఇప్పుడు తాము ప్రశ్నిస్తున్నామని ఆమె అన్నారు. అయితే.. తాము అవినీతి జరిగిందని చెప్పడానికి ఎవ్వరమని ప్రశ్నించారు. ఈ విషయంపై త్వరలో కోర్టులో న్యాయమూర్తి నిర్ణయిస్తారని అన్నారు. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో చేసిందా లేదా అనే అనుమానం తమకు ఉందన్నారు. “మీరు(సర్కారు) రిమాండ్కు పంపారు… వాదోపవాదాలు అయ్యాక వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. మాజీ సీఎం, వయసులో పెద్ద అయిన చంద్రబాబును అరెస్టు చేయడంపై సహజంగానే రాజకీయ పార్టీగా తమకు కూడా ఆవేదన ఉంటుందని వ్యాఖ్యానించారు. పుస్తెలు తెంపైనా డబ్బులు తీసుకుంటాడు… అంటూ సీఎం జగన్పై పురందేశ్వరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన.. ఇప్పటి వరకు నిషేధించకపోగా.. మరింతగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజమన్నారు. కొత్త బ్రాండ్లను తెచ్చి ప్రజల రక్తం పీల్చుతున్నారని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే.. ఆయన తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారని అన్నారు. ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హాని కరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతుందన్నారు. 15 రూపాయలకు తయారు చేసే ఒక మద్యం సీసాను ఆరేడు వందలకు అమ్ముతున్నారని.. మహిళల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు.. బిడ్డల భవిష్యత్ నాశనం అయినా పర్వాలేదు.. కుటుంబాలు చిద్రమైన పర్వాలేదు. జగన్కు డబ్బులే కావాలని తీవ్రస్థాయిలో పురందేశ్వరి నిప్పులు చెరిగారు.