ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2 రోజుల క్రితం బిజెపి లోక్ సభ స్థానాలకు గాను అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో తెలంగాణలో 9 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించగా ఏపీలో ఒక్క స్థానానికి కూడా బిజెపి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. దీంతో, టీడీపీతో పొత్తు నేపథ్యంలోనే ఏపీ నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదని ప్రచారం జరిగింది. కాబట్టి టీడీపీతో బీజేపీ పొత్తు పొడిచే అవకాశాలున్నాయని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేనల ఆశలపై నీళ్లు చల్లుతూ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ జాబితాను రెండు రోజుల్లో హై కమాండ్ కు పంపుతామని చెప్పారు. పార్లమెంటరీ కమిటీ ఆ జాబితాపై సమీక్ష జరిపి తుది జాబితాను ఖరారు చేస్తుందన్నారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని అన్నారు. ఏపీలో పొత్తులపై బీజేపీ పెద్దలు ప్రకటిస్తారని అన్నారు.
ఇక, తాజాగా చిన్నమ్మ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి సుముఖంగా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అటువంటి ఆసక్తి ఉంటే ఎన్నికలు మరో 40 రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం చెప్పి ఉండేవారని అంటున్నారు. టిడిపి పొమ్మనలేక బీజేపీ పొగబెడుతోందని పుకార్లు వస్తున్నాయి. బిజెపి, వైసీపీల మధ్య రహస్య మైత్రి బంధం అలాగే కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో బిజెపి చెప్పినట్లు వినే ఛాన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ చీకటి పొత్తు కొనసాగుతున్న వైసీపీని ఎందుకు వదులుకోవాలన్న భావనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది.