టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన బంద్ కు మాత్రం ఏపీ బీజేపీ మద్దతు ఇవ్వలేదు. దీంతో, చంద్రబాబు అరెస్టుకు ఏపీ బీజేపీ పూర్తి సంఘీభావం ప్రకటించలేదని కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ మిత్రపక్షమైన జనసేన..టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోని తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై పురందేశ్వరి తాజాగా స్పందించని వైనం ఆసక్తికరంగా మారింది.
ఈ కేసులో సిఐడి తీరు సందేహాస్పదంగా ఉందని పురంధేశ్వరి షాకింగ్ ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను సిఐడి అధికారులు సందర్శించారా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు తీరును తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఇక, జగన్ పై పురంధేశ్వరి విమర్శలతో విరుచుకుపడ్డారు. మధ్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ మద్యాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళల పుస్తెలు తెంపి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని దుయ్యబట్టారు. మద్యంపై వచ్చిన ఆదాయంలో కొంత తాడేపల్లి ప్యాలెస్ కు సమర్పించుకోవాల్సి ఉంటుందని ఆరోపించారు.
మద్యం ద్వారా ప్రతి ఏటా దాదాపు 57 వేల కోట్ల ఆదాయం వస్తోందని, కానీ బడ్జెట్లో మాత్రం 20 వేల కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తున్నారని ఆరోపించారు. అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రమాదకర రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని, ఇదో పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. 2019లో మద్యంపై ఏపీకి 18 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఇప్పుడు 32 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం ప్రజల ప్రాణాలతో జగన్ చలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.