వైెఎస్, ఎన్టీఆర్ ల తరహాలోనే వంగవీటి రంగా పేరును ఏపీలోని ఒక జిల్లాకు పెట్టాలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో పరోక్షంగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక దానికి వంగవీటి పేరు పెట్టాలని, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన కోరారు. ఈ పేర్ల వ్యవహారం నేపథ్యంలోనే కన్నా వంటి కొందరు బీజేపీ నేతలు జీవీఎల్ ను వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే, జీవీఎల్ మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర రాజకీయాలు..కేవలం రెండు పార్టీలకో, కుటుంబాలకో పరిమితం కాదని, మిగతా నాయకులెవరూ కనిపించరా అని ప్రశ్నించడం షాకింగ్ గా మారింది. కుదిరితే ఆ పార్టీ కుదరకపోతే ఈ పార్టీ… లేదంటే ఆ కుటుంబం కాకపోతే ఈ కుటుంబం…అంటూ జీవీఎల్ వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే బీజేపీ నేత జీవీఎల్ కు కేంద్ర మాజీ మంత్రి, బీజేేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకుని వచ్చి పేదలకు నిజమైన సంక్షేమం అందించారని గుర్తు చేశారు. జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయంవంటివాటిని ప్రజలకు అందించారని గుర్తు చేశారు. ఆ ఇద్దరిలో మరొకరు ఫీజు రీఇంబర్స్ మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అందించారంటూ వైఎస్సార్ ని ఉద్దేశించి ప్రశంసించారు. ఆ ఇద్దరు కాదు…ఆ మహానుభావులు అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.