వైసీపీ అధ్యక్షుడు, ఏజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గం పులివెందులలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీడీపీ. ఇటీవల జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఛైర్మన్ల ఎన్నికల్లో టీడీపీ యమా జోరు చూపించిన సంగతి తెలిసిందే. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలను, హిందూపురం మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది.
అయితే ఇప్పటికే పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సొంతం చేసుకున్న టీడీపీ.. ప్రస్తుతం పులివెందులపై దృష్టి సారించింది. జగన్ అడ్డాలో పసుపు జెండా రెపరెపలాడేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బలమైన వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక క్యాడర్ రెడీ అయింది. తాజాగా పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదా నేడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
షాహిదా తో పాటు వైసీపీకి మద్దతుగా ఉన్న మరో ఇరవై కుటుంబాలు కూడా టీడీపీలో చేరారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పులివెందులలోని పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారట. మరి ఈ వలసలకు అధినేత జగన్ ఎలా చెక్ పెడతారు? తన రాజకీయకోట అయిన పులివెందుల మున్సిపాలిటీని ఏ విధంగా కాపాడుకుంటారు? అన్నది చూడాలి.