‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ లో 1990లలో కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత, దారుణాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారని ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంపై ప్రధాని మోడీ సహా పలువురు ప్రశంసలు కురిపించారు. అయితే, తాజాగా ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్లు కూడా మొదలయ్యాయి. ఈ చిత్రంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో, ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సమర్ధిస్తుండగా…మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక, తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంపై స్పందించారు కానీ, ఆ సినిమా పేరు ప్రస్తావించకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
‘‘అప్పుడు మనకు తెలియని విషయాలెన్నో.. ఇప్పుడు మనకు తెలిసొస్తున్నాయి’’ అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ లో కశ్మీర్ ఫైల్స్ అని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో బిగ్ బీ తీరును ఖండిస్తూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అలా పరోక్షంగా చెప్పే బదులు.. ట్వీట్ లో సినిమా పేరు పెట్టవచ్చు కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదో చెప్పలేదనకుండా ముక్తసరి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేదంటే భయం వల్ల పేరు చెప్పడం లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర హోంశాఖ ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆ చిత్రం నేపథ్యంలో వివేక్ కు ముప్పు వాటిల్లుతుందేమోనన్న అనుమానంతో సీఆర్పీఎప్ జవాన్లతో భద్రత కల్పించారు.