పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్యాన్ పార్టీలో చేరబోతున్నారంటూ గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసీపీ ఊదరకొడుతోంది. వర్మ ఏమి మాట్లాడినా వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వల్లమాలిన కపట ప్రేమను కురిపిస్తోంది. అయితే టీడీపీతో వర్మకు అనుబంధం ఎక్కువ. టీడీపీలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వర్మ.. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుండి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత చేతిలో వర్మ ఓటమి పాలయ్యారు.
2014లో వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ.. వర్మ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ సత్తా ఏంటో నిరూపించుకుని మళ్లీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వర్మకు టికెట్ ఇచ్చినప్పటికీ.. ఫ్యాన్ గాలి ముందు నిలబడలేకపోయారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం వర్మ పిఠాపురం సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ అధిష్టాతం సూచన మేరకు పవన్ గెలుపులో వర్మ కీలక పాత్రను పోషించారు.
అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక వర్మకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. జనసేన నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం రాలేదు. మరోవైపు రెండు దఫాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వర్మకు అవకాశం కల్పించలేదు. ఈ విషయంలో వర్మ కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. ఇదే అదును వైసీపీ రంగంలోకి దిగింది. వర్మ టీడీపీని వీడి వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం చేస్తోంది.
అయితే అటువంటి పరిస్థితి లేదని వర్మ అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు వైసీపీలో చేరితే వర్మకు ఇబ్బందులు తప్పవు. ఇక టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉన్నంత వరకు పిఠాపురంలో వర్మకు ఛాన్స్ దక్కే అవకాశమే లేదు. కానీ, వచ్చే సంవత్సరం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. కొత్త నియోజకవర్గాలు ఏర్పాడతాయి. పిఠాపురం నియోజకవర్గ విషయంలోనూ వర్గీకరణ ఉంటుంది. ఎలాగో త్వరలోనే పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ రావడం ఖాయం. ఎమ్మెల్సీ పదవి చేపట్టి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ఆయన భావిస్తున్నారట. ఎమ్మెల్సీ పదవి ద్వారా ప్రజలతో మమేకం అవుతూ 2029 ఎన్నికల్లో సత్తా చాటాలన్న వర్మ మాస్టర్ ప్లాన్ అని.. అది తెలియక వైసీపీ ఇష్టమొచ్చని ప్రచారం చేసుకుంటూ ఫూల్ అయిందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.