స్వామి భక్తి.. కుమారుడికి టికెట్ ఇచ్చారన్న కృతజ్ఞత వెరసి.. మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కాస్తా.. డ్రైవర్ నాని అయ్యారు. ఉత్సాహంగా పెద్ద బస్సే నడుపుతూ.. ఆయన సిద్ధం సభకు హాజరయ్యా రు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహిస్తున్న వైసీపీ ‘సిద్ధం’ సభకు శ్రేణులను తీసుకువెళ్లేందుకు తానే స్వయంగా డ్రైవర్ అవతారం ఎత్తారు పేర్ని నాని.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ‘సిద్ధం` సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విశాఖలో తొలి సభ పెట్టగా, ఇప్పుడు మలి సభ ఏలూరులో నిర్వహిస్తున్నారు. ఈ సభకు భారీగా నేతలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మచిలీపట్నం నుంచి వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో సభకు బస్సుల్లో కదిలారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఈ సందర్భంగా తన స్వామి భక్తి ప్రదర్శించారు.
నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి బస్సులో దెందులూరు సభకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్వయంగా బస్సు డ్రైవర్ గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు. ‘సిద్ధం’ సభ టీషర్ట్, వైసీపీ క్యాప్ ధరించిన ఆయన డ్రైవింగ్ చేస్తూ.. రహదారి పొడవునా వాహనదారులకు అభివాదం చేశారు. ఆయన అభిమానులు జై పేర్ని అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి ఇప్పటి వరకు ఆయన ఇలా డ్రైవింగ్ చేయకపోవడంతో అబిమానుల్లో కేరింతలు కనిపించాయి. ఏదేమైనా స్వామి భక్తి ఏమైనా చేయిస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ప్రతిపక్షాల కామెంట్లు తెలిసిందే కదా.. నిబంధనలు అతిక్రమించారని, ఆయనకు హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉందా అని, యూనిఫాం లేకుండా జాతీయ రహదారిపై బస్సు నడిపినందుకు రెండు వేలు ఫైన్ వేయాలని ప్రతిపక్ష నాయకులు కామెంట్లు చేస్తున్నారు. కానీ, ఆయన ఈ కామెంట్లు చేసే లోపే.. బస్సుతో తుర్రుమంటూ.. సభకు చేరుకున్నారు.