వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విజయం తధ్యమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ ను ప్రజలకు అంకితం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ అవినీతి అనకొండ రుషికొండను మింగేసిందని, 9 నగరాల్లో తొమ్మిది ప్యాలెస్ లున్న పెత్తందారుడు జగన్ అని లోకేష్ ఆరోపించారు. ఒక్కడి కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని, రుషికొండను నిర్వీర్యం చేసి విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఉత్తరాంధ్రలో భూములు కొట్టేసి ఇక్కడ ప్రజలతో జగన్ ఆడుకుంటున్నారని మరో రెండు నెలల్లో ప్రజలే జగన్ ను ఫుట్బాల్ ఆడుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే ఆ భూములు కొట్టేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ లు ఖాళీ భూములపై వాలి కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ తన అభ్యర్థుల స్థానాలను మారుస్తుంటే వారంతా వైసీపీలో ఉండలేక పారిపోతున్నారని అన్నారు. అంబటి రాయుడికి టికెట్ ఇచ్చేందుకు వందల కోట్లు అడగడంతోనే ఆయన బయటికి వచ్చేశారని చెప్పారు. 70 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి అభ్యర్థులే కరువయ్యారని లోకేష్ సెటైర్లు వేశారు.