మాచర్ల లో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసం, పార్టీ కార్యాలయానికి వైసీపీ శ్రేణులు నిప్పు పెట్టాయాన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ అల్లర్ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఉన్నారని వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఫ్యాక్షన్ నాయకుడు బ్రహ్మారెడ్డిన మాచర్లకు పంపి దాడులు చేయిస్తున్నారని, బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత మాచర్లలో ఉద్రిక్తతలు పెరిగాయని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఖండించారు. రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మాచర్ల అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. నియోజకవర్గవ్యాప్తంగా జూలకంటికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారని., అది చూసి ఓర్వలేకే సిగ్గుమాలిన చర్యలకు పిన్నెల్లి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
పిన్నెల్లిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనిచ జనాల ఛీత్కారాలను జీర్ణించుకోలేక టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు. మాచర్లను మంటల్లోకి నెట్టింది పిన్నెల్లేనని విమర్శించారు. పిన్నెల్లి రంకెలేస్తే భయపడటానికి మాచర్లలో ఉన్నది జైలుపక్షి కాదనిచ అక్కడున్నది జూలకంటి బ్రహ్మారెడ్డి అని చెప్పారు. జగన్ బినామీ పిన్నెల్లి అని పయ్యావుల షాకింగ్ ఆరోపణలు చేశారు.
ఇక, మాచర్లలో వైసీపీ మూకలు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. మాచర్ల ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, కార్డన్ సెర్చ్ నిర్వహించి ఏం సాధించారని పోలీసులను నిలదీశారు. యూపీ, బీహార్ లలో అరాచకశక్తులను అక్కడి ప్రభుత్వాలు అణిచివేశాయని, అన్నపూర్ణ లాంటి ఏపీలో మాత్రం ప్రభుత్వమే అరాచకాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
మహిళలు, పసిబిడ్డలు వంటిళ్లలో దాక్కొని ఏడుస్తున్నా ఆగకుండా విధ్వంసం కొనసాగించారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఆటవిక పరిస్థితులను ఆంధ్రప్రదేశ్ లో చూస్తామని అనుకోలేదన్నారు. ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించడం తగదని కేంద్రాన్ని విమర్శించారు. ప్రశాంత వాతావరణంలో పాలన సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సోమిరెడ్డి గుర్తుచేశారు.