పెడనలో బహిరంగ సభ సందర్భంగా జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలను, టీడీపీ కార్యకర్తలను ఏనాడూ రెచ్చగొట్టలేదని, కేవలం ఆవేశంగా మాట్లాడానని చెప్పారు. అలా చేసేవాడిని కాదని, తాను అలాంటి వాడినైతే ప్రధాని మోడీ పక్కన కూర్చోబెట్టుకుంటారా అని ప్రశ్నించారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం అని, రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని అన్నారు. 330 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు పక్కదారి పట్టాయని, అలా పట్టడంలో ఏపీ నెంబర్ వన్ అని అన్నారు.
టీడీపీ అనుభవం ఉన్న పార్టీ అని, ఇపుడు పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఆ పార్టీని జనసైనికులు తక్కువగా చూడొద్దని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఒకటి కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో చంద్రబాబు అనుభవానికి జనసేన బలం తోడైతే వైసీపీని భూస్థాపితం చేయవచ్చని, టీడీపీ అనుభవం, జనసేన పోరాటం కలిస్తే వైసీపీని గద్దె దించవచ్చని చెప్పారు. తనను తిట్టిన వారితోనూ చేయి కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏపీలో అడుగు పెట్టాలంటే వీసా కావాలని అన్నారు. రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి 2014లో మద్దతిచ్చానని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా 2024 ఎన్నికలలో టీడీపీతో కలిసి వస్తున్నానని చెప్పారు. జగన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదని, రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని దుయ్యబట్టారు.
జగన్ దగ్గర పావలా దమ్ము లేదని, పార్లమెంట్లో హోదా కోసం గళం ఎత్త లేదని, ఆ రోజు సోనియాగాంధీకి కనిపించకుండా మూలకు వెళ్లి ప్లకార్డ్ పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం వద్దకు వెళ్లి కేసులు లేకుండా చేయాలని కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. తాను ఎవరినీ కులాల వారిగా చూడనని, కుల నాయకులతో విమర్శలు చేయించే చచ్చు సలహాలు తన వద్ద పని చేయవన్నారు. జగన్‌ది కుటుంబ పాలన అని, ప్రజా కంఠకుడిపై మనమంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లతో కేసులు పెట్టించి తనను జైలుకు పంపించాలని చూస్తున్నారని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పవన్ అన్నారు.