2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అందుకే, ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల షూటింగులను శరవేగంతో పూర్తి చేసి…2023 ఏప్రిల్ నాటికి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని పవన్ అనుకుంటున్నారట. అందుకే, గతంలో ఏడాదికి రెండు సినిమాలు అతి కష్టమ్మీద పూర్తి చేసే పవన్…ఇలా వరుస బెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
2024 ఎన్నికలను పవన్ డూ ఆర్ డై తరహాలో తీసుకుంటున్నారట. పొత్తు ఏ పార్టీతోనైనా సరే..సింగిల్ గానైనా సరే 2024లో ఏపీలో అధికారం చేపట్టాలని పవన్ గట్టిగా వ్యూహాలు రచిస్తున్నారట. ఈ పాదయాత్ర నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వంటి సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కూడా పవన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ లా కాకుండా పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారట. అయితే, అనుకున్న సమయానికి సినిమా షూటింగులు పూర్తికాకపోవడం, ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లే అవకాశం ఉండడంతో పవన్ పాదయాత్ర బస్సు యాత్రగా మారింది.
ఈ నేపథ్యంలోనే పవన్ బస్సుయాత్ర చేయబోయే భారీ బస్సు తరహా వాహనం తాజాగా సిద్ధమైంది. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ పవన్ ఆ బస్సు ఫొటోలను, వీడియోను ట్వీట్ చేశారు. బస్సుకు సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆలివ్ రంగులో మిలిటరీ వాహనంలా కనిపిస్తోన్న ఈ బస్సు చాలా దృఢంగా కనిపిస్తోంది. యాత్ర సమయంలో పవన్ బస చేసేలా అవసరమైన అన్ని సదుపాయాలు ఈ బస్సులో ఉన్నాయని తెలుస్తోంది. హై సెక్యూరిటీ సిస్టమ్, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ పొందుపరిచారు. ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించి వాహనాన్ని పరిశీలించారు.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022