టీడీపీ-జనసేనల పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ అన్నారు. ఒకట్రెండు చోట్ల ఇబ్బందులున్నా ఇరు పార్టీల నేతలు కలిసి ముందుకెళ్లాలని జనసేన నేతలు, కార్యకర్తలకు పవన్ సూచించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేయాలని అన్నారు.
సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నానని పవన్ అన్నారు. ప్రతికూల సమయాల్లోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుందని చెప్పారు. పార్టీ పరమైన నిర్ణయాలు తానొక్కడినే తీసుకోవడంలేదని పవన్ అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే టీడీపీతో కలిసి ముందుకు వెళుతున్నామని, జనసేన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులేనని చెప్పారు.
మరోవైపు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పవన్ ఈ నెల 23న రాజమండ్రిలో భేటీ కానున్నారు. లోకేష్, పవన్ ల అధ్యక్షతన టీడీపీ-జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. ఎన్నికల కోసం ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. కాగా, పొత్తు సమన్వయం కోసం టీడీపీ, జనసేన ఇప్పటికే జేఏసీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.