2024 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు జనసేనాని. జనసేన నిర్వహించిన కౌలు రైతు భరోసా, జన వాణి కార్యక్రమాలకు అనూహ్య స్పందన రావడంతో తాజాగా ‘యువ శక్తి’ పేరుతో బహిరంగ సభలు నిర్వహించేందుకు పవన్ రెడీ అవుతున్నారు. జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్న తొలి సభకు పవన్ హాజరుకానున్నారు.
రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళ మెత్తడానికే ‘యువ శక్తి’ సభలు నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేందుకే పలు జిల్లాల్లో ‘యువ శక్తి’ సభలు జరపాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఇక, తమ రాజకీయ ప్రత్యర్థుల గురించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఎస్పీ వ్యవస్థాపకుడు, దివంగత కాన్షీరామ్ చేసిన వ్యాఖ్యలను నాగబాబు ప్రస్తావించారు. “మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం మాకు లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మేము ఎవరికోసమైతే పోరాడుతున్నామో వారే మా శత్రువుకు రక్షణ కవచంలా మారారు. లేకుంటే ఈ యుద్ధంలో ఎప్పుడో గెలిచి విజయఢంకా మోగించి ఉండేవాళ్లం” అని పేర్కొన్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందని, 2019 ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని నాగబాబు అన్నారు.
అయితే, 2024లో అలా ఉండదని నాగబాబు అన్నారు. విప్లవం వస్తోందని, జనసేన గెలవడం ఖాయమని అతడి (పవన్ కల్యాణ్) ప్రస్థానం ఒక చరిత్ర అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తమను కాదని తమ శత్రువు వైసీపీని గెలిపించారన్న అక్కసును నాగబాబు ఇలా వెళ్లగక్కారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.