టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గత ఏడాది `క` మూవీతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమా `దిల్రుబా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన దిల్రుబా చిత్రం రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం.. తాను హీరో కాకపోయుంటే ఏం అయ్యేవాడినో వివరించాడు. `లైఫ్ లో ఏదైనా పెద్దగా చేయాలని అనుకునేవాడ్ని. అందులో భాగంగానే నటుడిగా మారాను. అయితే రాజకీయాలన్నా నాకెంతో ఇష్టం. మంచి, చెడు అనేది పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవ్వడం చాలా గొప్ప విషయం. అది రాజకీయాల్లో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.
రాయలసీమకు చెందినవాడ్ని కాబట్టి రాజకీయాలను దగ్గర నుంచి చూశాను. ఒకవేళ నేను నటుడుని కాకపోయుంటే కచ్చితంగా పొలిటికల్ లీడర్ ను అయ్యేవాడిని` అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. అలాగే త్వరలోనే తాను ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా కిరణ్ తెలియజేశాడు. కాగా, కడప జిల్లా రాయచోటిలో జన్మించిన కిరణ్ అబ్బవరం.. స్టడీస్ అనంతరం చెన్నై, బెంగళూరులో రెండున్నర సంవత్సరాల పాటు నెట్వర్క్ కన్సల్టెంట్గా పనిచేశాడు. ఆ సమయంలోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు. నటనపై మక్కువ పెంచుకున్న కిరణ్.. ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2019లో `రాజా వారు రాణి గారు` మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరి ఈ యంగ్ హీరోకు దిల్రుబా ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.