టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్.. ప్రజా క్షేమం, సామాజిక సేవకే ప్రాధాన్యత ఇస్తూ అటుకులు వేస్తున్నారు. పాలిటిక్స్ గురించి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కెరీర్ పై అందరిలోనూ సందిగ్ధత ఏర్పడింది. 2023లో వచ్చిన `బ్రో` తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మరో కొత్త సినిమా రాలేదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేతిలో `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్` వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూడు చిత్రాలు కొంత షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. గత ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ సాధించడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయారు. ఆయన డేట్స్ దొరకడం నిర్మాతలకు కష్టతరంగా మారిపోయింది. దాంతో ఆయా చిత్రాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కొత్త సినిమాలు చేస్తారా? అన్న అనుమానాలు అభిమానాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
కొందరు నెటిజన్లు ఒక అడుగు ముందుకేసి సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ కెరీర్ గురించి పవన్ మాట్లాడారు. `ప్రజాసేవ చేయడానికే రాజకీయాలకు వచ్చాను. నేను నాకంటూ ఎటువంటి సంపద కూడబెట్టుకోలేదు. ఎలాంటి వ్యాపారాలు లేవు. నాకు ఉన్న ఏకైక ఆదాయం మార్గం యాక్టింగ్ మాత్రమే. నాకు డబ్బు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. సినిమాలు చేస్తున్నంతవరకు వాటికి న్యాయం కూడా చేయాలి` అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కామెంట్స్ తో అందరికీ ఒక స్పష్టత అనేది వచ్చేసింది.