“ఈ సారి ప్రభుత్వం మనదే. ఏపీలో జనసేన ప్రబుత్వం ఏర్పడి తీరుతుంది. ఈ విషయంలో డౌటే లేదు. ప్రజల దృష్టి మనవైపే ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతోంది. దీనిని ఎవరూ ఆపలేరు. మన జెండా ఎగురుతుంది“ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తాజాగా జనసేన లీగల్ భేటీలో ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
పార్టీ భవిష్యత్తును ఈ సందర్భంగా పవన్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
అదేసమయంలో దసరా నుంచి ప్రారంభించాలని అనుకున్న బస్సు యాత్రను వాయిదా వేశారు.
జనసేనకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ఈసారి అసెంబ్లీలో జనసేన జెండా ఎగరాలని, ఎగురుతుందని అన్నారు. జన సైనికులు పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేనకు బలమైన స్థానాలను గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు.
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
అక్టోబర్లో చేపట్టే జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
జనసేనాని పార్టీ బలోపేతంపై అధ్యయనం పూర్తయ్యాక యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.
త్వరలో నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తామని పవన్ చెప్పారు.
వేగంగా అధికారం అందుకోవడం లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా దివంగత ఎన్టీఆర్ ను పవన్ ప్రస్తావించారు. ఆయనతో పోటీ పడలేమని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
పార్టీలు నిలబడాలంటే బలమైన సిద్ధాంతాలు ఉండాలని చెప్పారు.
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ వదిలేసి పారిపోతానని చాలామంది ఆశించారని… వారి కోరిక నేరవేరకుండా చేశానన్నారు.
అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానన్నారు. తన దగ్గర అపరిమిత ధనం లేదని, ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని అన్నారు.
‘‘నా దేశాన్ని, నా నేలను, నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో జనసేనకు కనీసం 10 సీట్లు వచ్చినా తమ పోరాటం మరోలా ఉండేదని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు.