గన్నవరంలో టిడిపి కార్యాలయంపై దాడి ఘటనను ఖండిస్తూ టిడిపి నేత పట్టాభిరామ్ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, పట్టాభిరామ్ తో పాటు పలువురు టిడిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఇంతవరకు పట్టాభి ఆచూకీ వెల్లడి కాకపోవడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్త పట్టాభి ఆచూకీ ఎక్కడో చెప్పాలంటూ పట్టాభి భార్య చందన పోలీసులను నిలదీస్తున్నారు. తన భర్తను చూపించకపోతే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. తన కుమార్తె రాత్రి నుంచి భయపడుతోందని.. తన తండ్రి ఇంటికి రాలేదని ఆందోళనలో ఉందన్నారు. తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని.. ఆయనకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వెళుతున్న చందనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చందన తన ఇంటి వద్ద నెేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ దీక్ష చేపట్టారు. తన భర్త ఎక్కడున్నారో చెప్పాలని, ఆయన క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా వీడియో కాల్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, హత్యలు, దాడులు, తప్పుడు కేసులు పెరిగిపోయాయని, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల ఇళ్లు, ప్రతిపక్షాల కార్యాలయాలపైనే దాడులు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ ఫ్యాక్షనిస్టు సైకో పరిపాలన ఎలా ఉంటుందో జగన్ పాలనలో ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతుంటే జగన్కు జ్వరం వస్తోందని వ్యాఖ్యానించారు.
ఇక, సీఎం జగన్ సైకోయిజానికి ఎవ్వరూ భయపడటం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్ చూపించారని ఫైర్ అయ్యారు. గన్నవరం ఘటనకు పూర్తిగా జగన్ రెడ్డి , వల్లభనేని వంశీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బోడే ప్రసాద్ ను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని, కార్యకర్తలను, నాయకులను లాక్కెళ్లారని ఆరోపించారు.