యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో మెప్పించడంతో ఈ చిత్రం అమెరికా సహా ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు.
దీంతో, ఈ సారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు అవార్డుల పంట పండుతుందని భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ దిశగా తొలి అడుగుపడింది. ఆస్కార్ అవార్డులకు ఆర్ఆర్ఆర్ చిత్రంంలోని నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయింది. ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ నుంచి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా ఈ పాట సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాలో అద్భుతంగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ ఖాయమని భారీ అంచనాలున్నాయి. సినీ ప్రపంచంలో అత్యుత్తమ అవార్డుగా పరిగణించే ఆస్కార్ 2023కు జూనియర్ ఎన్టీఆర్ ‘బెస్ట్ యాక్టర్’ కేటగిరీలో గట్టి పోటీ ఇవ్వొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ మేగజైన్ పేర్కొంది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో పోటీలో ఉండే టాప్-10 నటుల జాబితాను ఈ మేగజైన్ రూపొందించగా…తారక్ కూడా ఆ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు.
అంతేకాదు, ఈ లిస్ట్ లో తారక్ తొలి స్థానంలో నిలవడం విశేషం. టామ్ క్రూజ్, పాల్ డనో, మియా గోత్, పాల్ మెస్కల్, జో క్రవిట్జ్ లను తోసిరాజని టాప్-10లో తారక్ నెంబర్ వన్ గా నిలిచారు. కొమురం భీం పాత్రలో తారక్ నటించలేదని…జీవించారని పలువురు సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో, జూనియర్ ఎన్టీఆర్ నటనకు అస్కార్ తప్పక వస్తుందని, బెస్ట్ యాక్టర్ కేటగిరీ నామినేషన్లలో తప్పక చోటు లభిస్తుందని ఆ మేగజైన అంచనా వేస్తోంది.