ఏపీలోని థియేటర్లలో టికెట్ల ధర పెంపుపై కొంతకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టాలీవుడ్ సినీ పెద్దలు, నిర్మాతలు…ఏపీ సర్కార్ తో చర్చించాలని రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ నుంచి పిలుపు కూడా వచ్చింది. టాలీవుడ్ తోపాటు ఏపీలోని థియేటర్లకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు చిరుతోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులకు మంత్రి పేర్ని నాని ద్వారా జగన్ ఆహ్వానం పంపించారు.
ఈ భేటీలో ముఖ్యంగా థియేటర్ల సమస్య, టికెట్ ధరలు, థియేటర్లపై ఆధారపడిన కార్మికుల ఉపాధి తదితర అంశాలు చర్చించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో రోజువారీ షోల పెంపునకు అనుమతి వంటి పలు విషయాలు చర్చించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ఏపీలో
సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో స్టాలిన్ తరహాలోనే ఇకపై ఏపీలోను సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ కోసం ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అంతేకాదు, దీనికి సంబంధించిన జీవోని తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసింది. రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ మాదిరిగానే ఏపీలోని సింగిల్ థియేటర్లు, మల్టిప్లెక్స్ లలో టికెట్ల విక్రయానికి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పోర్టల్ కు సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, ఈ పోర్టల్ విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనుంది.