కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామన్న రిలీఫ్ లో ఉన్న ప్రపంచానికి సరికొత్త వేరియంట్ ఒకటి కొత్త భయాందోళనలకు తెర తీసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చేసిన ఈ కొత్త వేరియంట్.. డెల్టా అమ్మ మొగుడన్న మాటను ఇప్పటికే సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా కొత్త రూపం ఇప్పుడు ప్రపంచానికి కొత్త టెన్షన్ ను తెచ్చి పెట్టింది. తాజా వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది.
ఒకరి నుంచి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు..వ్యాక్సిన్ రక్షణకుసైతం సవాలు చేసే సత్తా దీని సొంతమని.. ఇది అత్యంత దుర్మార్గమైన కరోనా రూపంగా అభిప్రాయపడుతున్నారు. దీంతో.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అలెర్టు అయిపోయింది. ఈ వేరియంట్ తమ దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండా ఉండేందుకు ఎవరికి వారు తక్షణ చర్యలకు తెర తీస్తున్నారు. దీంతో.. మొన్నటి వరకు కరోనా కథ ముగిసిందనుకున్న వారంతా ఒక్కసారిగా హడావుడి మొదలైంది. ప్రభుత్వాలు సైతం ఉలిక్కిపడి.. ఈ అంశం మీద రివ్యూ చేయటం షురూ చేశాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా రోమ్ లోని ప్రతిష్టాత్మకమైన బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఫోటోను విడుదల చేసింది. ఈ చిత్రం చూసేందుకు ఒక మ్యాప్ లా ఉంది. డెల్టా వేరియంట్ కు.. ఒమిక్రాన్ వేరియంట్ కు మధ్యనున్న తేడాల్ని ఇట్టే తెలిపేలా ఈ ఫోటో ఉంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో అన్నింటి కన్నా ఎక్కువ జన్యు ఉత్పరివర్తనాలు ఉన్నది ఇదేనని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ ఉత్పరివర్తనలు ప్రమాదకరమైనవని..భవిష్యత్తులో సోకే కొత్త వేరియంట్లకు ఇది కారణమవుతుందని చెబుతున్నారు. డెల్టా వైరస్ కంటేఎన్నో రెట్లు ప్రమాదకరమైన ఈ వేరియంట్.. వ్యాక్సిన్ రక్షణ ఎంత? అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పష్టత రావటం లేదు. ఇతర వేరియంట్లకు భిన్న లక్షణాలు ఉన్నాయనటానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్న విషయాన్ని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోను చూసినప్పుడు.. డెల్టాతో పోలిస్తే.. తీవ్రత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పొచ్చు.