తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్యను దాచిపెడుతున్నారని, టెస్టుల సంఖ్య పెంచడం లేదని ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా కలకలం రేపుతోంటో వైన్ షాపులు, బార్లు బార్లా తెరవడంపై కూడా హైకోర్టు మండిపడింది. 3 రోజుల్లోపు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని లేకుంటే తామే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రభువ్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, ఫార్మసీలు, ల్యాబ్లు, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మీడియా, పెట్రోల్ బంక్, ఐటీ సేవలకు సర్కార్ అనుమతి నిచ్చింది. విద్యుత్, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ వంటి సంస్థలు యథాతథంగా నడుస్తాయి. స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సేవలు యథాతథంగా రాత్రిపూట కూడా కొనసాగుతాయి. ఎలాంటి ప్రత్యేకమైన పాసులూ అవసరం లేదు.
కాగా, కరోనా మహమ్మారి బాధితుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిన సంగతి తెలిసిందే.సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. స్వల్ప లక్షణాలతో కేసీఆర్ బాధపడుతున్నారని, తన ఫాం హౌస్ లో హోం ఐసోలేషన్ లో ఉండాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికిప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందని సోమేశ్ కుమార్ వివరించారు. 2 వారాల కిందట సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.