ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న’డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల’ (IFS) కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), శాన్ ఫ్రాన్సిస్కో గా ఎంపికయ్యారు.
ఈ రోజు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఐటీ, కామర్స్, స్థానిక ఎన్నారైల సమస్యలు తదితర అంశాలపై దృష్టి పెడతానని అన్నారు.
ప్రవాస భారతీయులందరితో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
ప్రవాస భారతీయులతో కలిసి పనిచేస్తానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.
నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన ‘డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల’కి ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలిపారు.
నల్గొండ జిల్లాలోని మోత్కూర్ పరిధిలో ఉన్న కొండగడప మండలం లో ‘డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల’ జన్మించారు.
1996లో కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేశారు.
ఐఎఫ్ఎస్ అధికారిగా తన బ్యాచ్ లోనే సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్నారు.
జర్మనీలోని బెర్లిన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీలో పని చేశారు.
న్యూఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా సేవలందించారు.
భారత దేశ భద్రతకు అత్యంత కీలకమైన పాకిస్తాన్ డెస్క్ ఇంచార్జ్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా గా పని చేసిన ‘డాక్టర్ టీ నాగేంద్ర ప్రసాద్’ తర్వాత, మరో తెలుగు వ్యక్తి ఆ పదవిని చేపట్టడం తెలుగు వారందరికీ గర్వకారణం.
ఇలా, వరుసగా రెండు సార్లు ఈ పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు చేపట్టడం అరుదైన రికార్డు.
నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా ‘డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల’ కి ‘నమస్తే ఆంధ్ర’ శుభాకాంక్షలు తెలుపుతోంది.