కరోనా కట్టడిలో జగన్ విఫలమయ్యారని, చేతులెత్తేశారని సాక్ష్యాత్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక, వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం జరగడానికి జగన్ వైఖరే కారణమని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో దేశీయ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ కంపెనీపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఓ వైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతుంటే…జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో సేద తీరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కులపిచ్చతో వ్యాక్సిన్ కంపెనీపై జగన్ ఏడ్చే బదులు… వచ్చిన వ్యాక్సిన్ వృథా కాకుండా వేసి ఉంటే బాగుండేదని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాలు 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేయడంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నా, ఏపీలో జగన్ నిమ్మకు నీరెత్తనిట్లున్నారని మండిపడ్డారు. ఏపీలో 18 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేశారని, దేశంలోనే వ్యాక్సినేషన్ లో ఏపీ అట్టడుగుస్థానంలో ఉండడానికి జగన్ వైఖరే కారణమని నిప్పులు చెరిగారు..
జగన్ సరైన సమయంలో స్పందించి ఉంటే ఏపీకి ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. మాస్కుతో మూతి తుడుచుకొని, తాడేపల్లి కొంపలో కాళ్లు ముడుచుకొని పడుకున్న జగన్ రెడ్డి గారు నిద్రలేవాలని ఎద్దేవా చేశారు. థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపబోతోందనే హెచ్చరికలపై మేల్కొనాలని లోకేష్ హితవు పలికారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం అధోగతిలో అగ్రస్థానంలో నిలిచిందని, ప్రగతిలో చిట్టచివరి స్థానంలో ఉందని సెటైర్లు వేశారు. ఎవరెలా చస్తే నాకేంటి…అంటూ తాడేపల్లి కొంపలో జగన్ హాయిగా నిద్రపోతున్నారని మండిపడ్డారు.