వైసీపీ ముఖ్య నాయకుడు , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెత్తందారీ పోకడలంటే ఇవి కాదా!“ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ ఇజానికి పుంగనూరు ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పుంగనూరులో టీడీపీ సానుభూతి పరులు చొక్కాలు విప్పించి దుర్భాషలాడిన ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ. బిహార్లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే. తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? సామాన్యులకు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే’’ అని మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి భువనేశ్వరి నిప్పులు చెరిగారు.
ఏం జరిగింది?
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో ఆయా ఘటనలను, సర్కారు వైఖరిని నిరసిస్తూ.. జిల్లాలు, మండలాలు, రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ అనేక మంది నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ కొందరు సానుభూతిపరులు సైకిల్ యాత్ర చేపట్టారు. వీరు పుంగనూరు చేరుకునే సరికి అక్కడి పెద్ది రెడ్డి అనుచరుడు సూరి రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి అడ్డాకే వస్తార్రా నా.. కొ..కల్లారా? అంటూ తీవ్ర దుర్భాషలాడారు. చొక్కాలు విప్పించి వెనక్కి పంపించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీనిపై చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తీవ్రంగా స్పందించారు. వైసీపీ తీరు సహా పెద్దిరెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే.. అని ప్రశ్నించారు. బిహార్లో కూడా ఇలాంటి దారుణాలు చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు తమ అభిమాన నేతపై సానుభూతి తెలిపే హక్కుకూడా లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.