టాలీవుడ్లో మరో ఘనమైన అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. నందమూరి అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మోక్షజ్ఞదే ఆ ఎంట్రీ. బాలయ్య తనయుడైన మోక్షజ్ఞ ఆరేడేళ్ల కిందటే అరంగేట్రం చేయాల్సింది. కానీ రకరకాల కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది.
ఐతే గత ఏడాది కాలంలో మోక్షజ్ఞ తనను తాను పూర్తిగా మార్చుకుని హీరోయిక్ లుక్‌లోకి మారిపోవడం.. తన అరంగేట్రానికి బాలయ్య కూడా రంగం సిద్ధం చేస్తున్న సంకేతాలు కనిపించడంతో ఎదురు చూపులు ఫలించబోతున్నాయని అర్థమైంది. ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్న విషయం కూడా దాదాపు ఖరారైనట్లే. రెండు రోజుల కిందటే సింహం పిల్లను చూపించే ఫొటోతో సింబా రాకకు రంగం సిద్ధమైందంటూ అతను చేసిన కామెంట్ మోక్షజ్ఞ అరంగేట్రం గురించే అని అర్థమైపోయింది.
తాజాగా ప్రశాంత్ వర్మ మరో పోస్ట్ పెట్టాడు. వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అని పోస్ట్ చేసిన ప్రశాంత్.. శుక్రవారం ఉదయం 10.36 గంటలకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు ప్రశాంత్. గత, ప్రస్తుత పోస్టును బట్టి ఇది కచ్చితంగా మోక్షజ్ఞ అరంగేట్రం గురించి ఇస్తున్న హింటే అని నందమూరి అభిమానులు హుషారుగా ఉన్నారు. కాకపోతే ఈ విషయాన్ని బాలయ్య కాకుండా ప్రశాంత్ వర్మ ప్రకటించడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మోక్షజ్ఞ అరంగేట్రం గురించి నందమూరి అభిమానులు ఎంతగానో, ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో తన డెబ్యూ మూవీకి సంబంధించి హడావుడి కొంచెం గట్టిగానే ఉండాలని కోరుకుంటున్నారు. బహుశా రేపటి ప్రకటన ప్రశాంత్ కాకుండా బాలయ్య నుంచే వస్తుందేమో చూడాలి. లాంచింగ్ గురించి ప్రకటన ఇచ్చి.. ఆ వేడుకను కొంచెం ఘనంగానే చేసే అవకాశముంది.