ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఉరవకొండ నియోజకవర్గంలో 6000 ఓట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు ఈనెల 28న చంద్రబాబు ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్పందించారు.
మన ఓట్లను మనం రక్షించుకుంటూ దొంగ ఓట్లు నిర్మూలిస్తే రాబోయే ఎన్నికల్లో వైసిపి అవుట్ అని రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు.దొంగ ఓట్లపైనే తమ పార్టీ ఆధారపడుతోందని, వాటితోనే విజయం సాధించాలని ప్రయత్నిస్తుందని రఘురామ ఆరోపించారు. అయితే దొంగ ఓట్లను నిర్మూలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం శుభపరిణామం అని అన్నారు. మార్గదర్శి సంస్థపై జగన్ దిశా నిర్దేశంతోనే వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. చందాదారులను మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని ఒత్తిడి చేశారని, వారిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని రఘురామ ఆరోపించారు.
ఐపీఎస్ పాస్ అయిన అధికారులు తింగరి చేష్టలకు పాల్పడుతున్నందుకు సిగ్గుపడాలని, వారు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో తెలియడం లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, తప్పులను ఈనాడు దినపత్రిక ఎత్తిచూపుతోందని, ఆ అక్కసుతోనే రామోజీని జగన్ వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ దుష్ట దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని, వి ఆర్ విత్ యు రామోజీరావు అని నినదించాలని రఘురామ పిలుపునిచ్చారు.
మార్గదర్శిపై తింగరి వేషాలను ఇలాగే కొనసాగిస్తే ఇదో ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉందని రఘురామ హెచ్చరించారు. సాక్షి పత్రికకు ఈనాడు అడ్డుగా ఉందని, అందుకే మార్గదర్శి సంస్థపై జగన్ ప్రభుత్వం పదేపదే దాడులు చేస్తుందని ఆరోపించారు. ఇసుకాసురుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు ప్రతి నెల 250 నుంచి 300 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆదాయం వస్తుందని ఆరోపించారు.